పెంపుడు శునకాలపై యజమానులు ఎంత ప్రేమగా ఉంటారో అందరికీ బాగా తెలుసు. పెంపుడు కుక్క తప్పిపోవడంతో దాన్ని ప్రేమగా పెంచుకున్న యజమాని అన్నం తినడం మానేసింది. ఇంకా కుక్కను తీసుకొచ్చిన వారికి తగిన పారితోషికం ఇస్తామని ప్రకటించారు. ఈ ఘటన ఢిల్లీ నగర శివార్లలోని గుర్గామ్లో జరిగింది. ఆ వివరాలను పరిశీలిస్తే... గుర్గామ్ నగరంలోని జనరల్ మోటార్స్ జనరల్ మేనేజరుగా పనిచేస్తున్న 43 ఏళ్ల సుధాచంద్రన్ పెంపుడు కుక్క హాట్చీ గత నెల 22వతేదీన తప్పిపోయింది.
సంజయ్ గ్రామ్ సెక్టార్ 14లోని ఇంటి కిరాయిదారుడు గేటు తెరచిపెట్టడంతో తన తెల్లటి పెంపుడు కుక్క బయటకు పోయిందని సుధా చంద్రన్ వాపోతున్నారు. కుక్క తప్పిపోవడంతో బాధపడిన సుధాచంద్రన్ ఈ ఏడాది దీపావళి పండగ కూడా చేసుకోలేదట. తన కుక్క ఆచూకీ కోసం సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా చేశారు. కుక్క ఆచూకీ తెలిపిన వారికి రూ.5వేల బహుమానం ఇస్తానని అన్నారు.
గతంలో గేటు తీసి ఉంటే బయటకు వెళ్లే కుక్క అరగంటలో తిరిగివచ్చేదని, ఈసారి కనిపించకుండా పోయిందని సుధాచంద్రన్ ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కకు సంబంధించిన పాత వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి దీని ఆచూకీ కోసం యత్నిస్తున్నానని, దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన కనిపిస్తుందని సుధాచంద్రన్ చెప్పారు.