తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించడంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజక వర్గంలో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సంఘం ఈ మేరకు ఏప్రిల్ 12న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఓపీఎస్, శశికళ వర్గం మధ్య ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. అయితే ఎన్నికలు ఇక రెండు రోజుల్లో జరుగుతాయని.. అనుకున్న సందర్భంలో.. ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది.
తమిళనాడులోని ఆర్కేనగర్ శాసనసభ స్థానానికి ఈ నెల 12న జరగాల్సిన ఉప ఎన్నికను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగాల్సిఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచడమే ఎన్నికల రద్దుకు కారణమైందని సమాచారం. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నివేదికను పంపింది. దీనిపై మరో సమగ్ర పరిశీలన అనంతరం ఐటీ అధికారులు రంగంలోకి దిగారు.
ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, నటుడు శరత్ కుమార్, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో సోదాలు జరుపగా సుమారు 90 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఓటర్ల కొనుగోలుకు వినియోగించినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఐటీ విభాగం కూడా జాతీయ ఎన్నికల సంఘానికి ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగానే ఎన్నికలను రద్దు చేసినట్లు ఈసీ స్పష్టం చేసింది.