బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

ఠాగూర్

సోమవారం, 7 జులై 2025 (11:12 IST)
బీహార్ ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీహార్ ప్రజల ఓటు హక్కును లాక్కోవడానికి బీజేపీ పన్నిన కుట్రగా కాంగ్రెస్ అభివర్ణించింది. 
 
బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కుకోవడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి చేస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పిలుపునిచ్చారు. ప్రత్యేక సమగ్ర సవరణపై తొలి రోజు నుంచి కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడుతుందని ఆయన గుర్తు చేశారు. 
 
'అనేక సంవత్సరాలుగా ఓట్లు వేస్తున్న ప్రజలు ఇప్పుడు పత్రాలు చూపించమని అడుగుతున్నారు. పేదలు, బలహీనులు, దళితులు, వెనుకపడిన వర్గాల ప్రజల ఓటు హక్కులను బలవంతంగా లాక్కోవడానికి బీజేపీ - ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తుంది. ఈ ప్రక్రియ వల్ల దాదాపు 8 కోట్ల మంది ప్రజలపై ప్రభావం పడుతుంది' అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
మరోవైపు, ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం కీలక ప్రకటన చేసింది. ముందుగా జారీ చేసిన ఆదేశాల మేరకు కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. క్షేత్ర స్థాయి నుంచి పకడ్బంధీగా చేస్తున్నామని, నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండవని తేల్చి చెప్పింది. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో ఈ ప్రక్రియలో మార్పులు చేసినట్లు వస్తున్న వార్తల క్రమంలో ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు బిహార్ ఎన్నికల సంఘం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 
ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్లు 2025 జులై 25లోగా ఎప్పుడైనా తమ పత్రాలను ఇవ్వొచ్చని చెప్పింది. ఒకవేళ పత్రాలు ఇవ్వకపోతే అభ్యంతరాల పరిశీలన సమయంలో కూడా అందించవచ్చని సూచించింది. ఈ ప్రక్రియలో మార్పులపై వస్తున్న వార్తలను నమ్మవద్దని, తప్పుడు సమాచారంతో ప్రజలను అయోమయానికి గురిచేయవద్దని కోరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు