తల్లి పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన చిన్నారిని పెంచుకుంటానని తెచ్చుకుంది ఓ మహిళ. అక్రమంగా పసిపాపను పెంచుకుంటానని తెచ్చుకున్న చిన్నారికి నరకం చూపింది. కనీసం ఆలనాపాలన కూడా కరువైంది. 17 రోజులకే ఆ పాప నిరాదరణకు గురైంది. ఇరుపొరుగు వారి సమాచారం మేరకు అధికారులు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన రాజ్యలక్ష్మి తెలిసినవారి ద్వారా 17 రోజుల పసిపాపను తెచ్చి పెంచుతుంది. కొంత డబ్బులు ముట్టజెప్పి చిన్నారిని తీసుకువచ్చింది. కానీ, ఆ పాప ఆరోగ్యంపై సరిగా శ్రద్ధ చూపించడం లేదు. దీంతో పాప జబ్బు పడింది. ఇది గమనించిన ఇరుగుపొరుగువారు చైల్డ్‌లైన్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
చైల్డ్‌లైన్ జిల్లా అధికారులు తమ సిబ్బందితో అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. ఈ దర్యాప్తులో ఎటువంటి దత్తత పత్రాలు లేకుండా అక్రమ పద్ధతిలో ఆ పాపను తీసుకు వచ్చినట్లు గుర్తించారు. ఆ పసికందును స్వాధీనం చేసుకొని బాలల సంరక్షణ కేంద్రం అధికారులకు అప్పగించారు. రాజ్యలక్ష్మిపై పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.