ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థిని గుర్మెహర్ కౌర్‌కు మద్దతిచ్చేవారు పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించేవారని.. అలాంటి వారిని దేశం నుంచి తరిమికొట్టాలని హర్యానా మంత్రి అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కార్గిల్ అమర వీరుడైన తండ్రి మరణానికి కారణం యుద్ధమేనని.. పాకిస్థాన్ కాదని చెప్తున్న గుర్మెహర్ కౌర్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గుర్మెహర్ కౌర్‌పై అనిల్ విజ్ మండిపడ్డారు. ఆమెకు మద్దతిచ్చేవారంతా పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉన్నవారేనని వ్యాఖ్యానించారు. తండ్రి మరణంపై గుర్మెహర్ రాజకీయం చేస్తున్నారని అనిల్ విజ్ ఆరోపించారు.
మరోవైపు కౌర్‌పై హర్యానీ మంత్రి అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, ప్రధాని మోడీపై బీహార్ ఎక్సైజ్ మంత్రి అబ్దుల్ జలీల్ మస్తాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ వేదికగా జలీల్ మస్తాన్ చేసిన వ్యాఖ్యలతో బీహార్ అసెంబ్లీ అట్టుడికి పోయింది. అధికార పక్షాలు, విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోటోను చెప్పులతో కొట్టాలంటూ మంత్రి వ్యాఖ్యానించడంపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం పెద్దనోట్లను రద్దు చేయడంపై ఆందోళన చేస్తున్న ప్రజలను ఉద్దేశించి మస్తాన్ చేసిన వ్యాఖ్యలతో అసెంబ్లీలో వివాదం రాజుకుంది. దీంతో సదరు మంత్రిని తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.