ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ స్వయంగా కమాండో ఆపరేషన్ వివరాలు తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారన్న పక్కా సమాచారంతో సైన్యం దాడులకు దిగినట్టు వివరించారు. అవసరమైతే మరోసారి కూడా సర్జికల్ స్ట్రయిక్స్‌కు దిగుతామని భారత డీజీఎంవో పాకిస్థాన్ డీజీఎంవోకు స్పష్టంచేసినట్టు రావత్ తెలిపారు.
ఆపరేషన్ జరిగిన తీరు, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలకు జరిగిన నష్టం తదితర వివరాలను క్షుణ్ణంగా తెలిపారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న విషయాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆయన చెప్పిన విషయాలతో పార్లమెంటరీ స్థాయీ సంఘంలోని చాలామంది సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు సంఘం ఛైర్మన్ బీసీ ఖండూరీ తెలిపారు.