దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా. ఈమె మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఎందుకో తెలుసా.. తన తండ్రి అంత్యక్రియలను నిర్వహించేందుకు ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతితో ఒకరోజు పాటు పోలీసుల పర్యవేక్షణలో ఆమె జైలు బయట గడపనున్నారు.
తన కుమార్తె షీనా బోరా హత్యకేసులో గత ఏడాది ఆగస్టులో ఇంద్రాణి అరెస్టయ్యారు. మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలిసి షీనాను ఇంద్రాణి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంద్రాణి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త పీటర్ ముఖర్జియా కూడా ఇదే కేసులో జైలుపాలయ్యారు.
తన మేనకోడలి పెళ్లి చూసేందుకు బెయిల్ ఇవ్వాలని ఆయన ఇటీవల పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. కానీ, తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు మాత్రం కోర్టు అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ.. ఆమె ఎవరితో మాట్లాడటానికి వీల్లేకుండా ఆంక్షలు కూడా విధించింది.