భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శుక్రవారం ప్రయోగించిన జీఎస్‌ఎల్వీ ఎఫ్-09 రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని షార్ సెంటర్ ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. జీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 11వ రాకెట్ ప్రయోగం. 2230 కేజీల జీశాట్ 9 ఉపగ్రహాన్ని అనుకున్నట్టుగా రోదసీలోకి చేర్చారు. జీశాట్ 9లో 12 ట్రాన్స్‌పాండర్లు, జీవితకాలం 12 ఏళ్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇస్రో కెరీర్‌లో స్వదేశీ క్రయో ఇంజిన్ ద్వారా నింగిలోకి చేర్చే అతి బరువైన ఉపగ్రహం జీశాట్ 09గా ఇస్రో పేర్కొంది. ఈ ఉపగ్రహం పాకిస్థాన్ మినహా మిగిలిన సార్క్ దేశాలకు 12 ఏళ్ళపాటు తన సేవలను అందించనుంది.
జీఎస్‌ఎల్వీ ఎఫ్-09 ఉపగ్రహానికి గురువారం కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా, శుక్రవారం సాయంత్రం పూట శ్రీహరికోట నుండి ఈ ఉపగ్రహన్ని విజయవంతంగా ప్రయోగించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనతో సార్క్ దేశాలకు ప్రయోజనం కల్పించేందుకుగాను ఈ ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది. ఈ ఉపగ్రహం భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాలకు సేవలను అందించనుంది. అయితే ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యానికి పాకిస్థాన్ అంగీకరించలేదు. మిగిలిన దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులకు ఈ ఉపగ్రహం 12 ఏళ్ళపాటు సేవలను అందించనుంది.