జల్లికట్టు క్రీడ కోసం తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌కు ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆమోదం తెలిపారు. దీంతో ఆదివారం మదురై జిల్లా అలంగానల్లూరులో జల్లికట్టు పోటీలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం పచ్చజెండా ఊపి అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన చెన్నై నుంచి మదురైకు బయలుదేరినట్టు సమాచారం.
మరోవైపు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరుపై అన్నాడీఎంకే ఎంపీలు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. జల్లికట్టుకు సంబంధించి తమ ఎంపీలు యేడాది కాలంగా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారని... కానీ, మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అన్నాడీఎంకే నేత తంబిదురై ఆరోపించారు. మోడీ తీరు తమకు తీవ్ర నిరాశను మిగిల్చిందని చెప్పారు.
జల్లికట్టు కోసం త్వరలో ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. జల్లికట్టు అంశాన్ని పరిష్కరించాలని అమ్మ జయలలిత గతంలోనే కేంద్రాన్ని కోరారని... కానీ, కేంద్ర ప్రభుత్వం తమ వినతిని పట్టించుకోలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తంబిదురై విమర్శించారు.