ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ నుంచి తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోహినూర్‌ను తిరిగి దేశానికి తెప్పించాల్సిన బాధ్యత తమది కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలని తాము ఆ దేశాన్ని ఆదేశించలేమని తెలిపింది.
కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ బలవంతంగా తీసుకెళ్లలేదని, దొంగతనం చేయలేదని, అప్పట్లో ఈస్టిండియా కంపెనీకి పంజాబ్ పాలకులు బహుమానంగా అందజేశారని కేంద్రం గతంలోనూ సుప్రీంకు తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది
అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్‌కు తీసుకురావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్ ఫ్రంట్, హెరిటేజ్ బెంగాల్ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. వీటిని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు చేపట్టింది. విదేశాల్లో ఉన్న ఆస్తులను భారత్‌కు తీసుకురావాలంటూ పిటిషన్లు దాఖలు చేయడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది.