లాక్ డౌన్ ఉల్లంఘన - రంగంలోకి ఆర్మీ .. సుప్రీంకోర్టులో వ్యాజ్యం
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (17:42 IST)
కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ను చాలామంది ఉల్లంఘిస్తున్న తరుణంలో దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలైంది.
వైరస్ నియంత్రణకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలయ్యేలా చూసేందుకు అన్ని రాష్ట్రాలలో ఆర్మీని రగంలోకి దించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త తరఫున న్యాయవాదులు ఓం ప్రకాష్, దుష్యంత్ తివారి పిటిషన్ ఈ దాఖలు చేశారు.
లాక్‌డౌన్ అమలవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఆరోగ్య సిబ్బందిపై దాడులు తప్పుడు వార్తలు ఆధారంగా పెద్దఎత్తున జనాలు గుమిగూడడం, మతపరమైన సమావేశాలు జరుగుతుండటంతో ఆర్మీని రంగంలోకి దించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అలాగే ఈనెల 14న ముంబైలో వలస కూలీలు పెద్దఎత్తున గుమిగూడిన అంశాలన్ని కూడా దానిలో పొందుపరిచారు. ఇక కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి వివాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు నివారించడంలో విఫలమయ్యాయి అని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
దేశంలో అనేక చోట్ల ప్రజలు గుమిగూడడంపై జాతీయ దర్యాప్తు సంస్థ తో విచారణ జరిపించాని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు.