చనిపోయాడనీ పోస్టుమార్టంకు తరలిస్తుండగా లేచి కూర్చొన్న పోలీస్ ఆఫీసర్.. ఎక్కడ?

గురువారం, 21 సెప్టెంబరు 2023 (15:52 IST)
విష పురుగు కుట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ పోలీస్ ఆఫీసర్‌లో ఎలాంటి చలనం లేకపోవడంతో ఆయన కుటంబ సభ్యులతో పాటు స్థానికులంతా చనిపోయారని నిర్ధారించుకున్నారు. పైగా, పోలీస్ ఆఫీసర్ కావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తుండగా, ఆయనలో చలనం కనిపించింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లుథియాలో ఇటీవల జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన పూర్తి వివరాలను పరిశీలిస్తే, 
 
మన్‌ప్రీత్ అనే పోలీస్ అధికారిని ఓ విషపు పురుగు కుట్టింది. దీంతో ఆయన అనారోగ్యంపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన్ను లుథియానాలోని బస్సీ ఆస్పత్రికి తరలించారు. అయితే, శరీరమంతా ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన అర్థరాత్రి ఆయన మృతి చెందినట్టు ఆసుపత్రి సిబ్బంది తెలిపారని తండ్రి రామ్ చెబుతున్నారు.
 
దీంతో మరుసటి రోజు మన్‌ప్రీత్‌ను పోస్టుమార్టం కోసం తరలిస్తుండగా ఆయన శరీరంలో కదలికలు రావడాన్ని అక్కడే ఉన్న మరో పోలీసు అధికారి గుర్తించారు. వెంటనే ఆయనను మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మన్‌ప్రీత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తమ ఆసుపత్రిలోని సిబ్బంది ఎవరూ మన్‌ప్రీత్ మరణించినట్టు చెప్పలేదని బస్సీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు