మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భార్య పుట్టింటివారికి డబ్బులు పంపిందనే కారణంతో భర్త ఆమెను పొట్టనబెట్టుకున్నాడు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ జౌరి అహిర్ గ్రామంలో డబ్బుల విషయంలో అరవింద్ సింగ్ యాదవ్ (50), గీత (47) గొడవపడ్డారు. గీత తన కుటుంబ సభ్యులకు డబ్బులు పంపినందుకు అరవింద్ నిలదీశాడు.
ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో అరవింద్ కోపంతో తన దగ్గరున్న లైసెన్స్ గన్ తీసుకుని భార్యను కాల్చాడు. మృతురాలి కొడుకు వాంగ్మూలం మేరకు పోలీసులు అరవింద్‌ను అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని.. ఈ గొడవలే ఈ అఘాయిత్యానికి దారితీసిందని ఇరుగుపొరుగు వారు చెప్తున్నారు.