రాష్ట్రపతి పదవి రేసులో తాను లేనని ఎన్సీపీ అధినేత, మరాఠా కురువృద్ధుడు శరద్ పవార్ స్పష్టం చేశారు. తమ పార్టీకి కేవలం 14 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారని... రాష్ట్రపతి కావడానికి అవసరమైనంత బలం తనకు లేదని చెప్పారు. తాను ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నట్టు గుర్తు చేశారు.
తమ పార్టీకి కేవలం 14 మంది ఎంపీలను మాత్రమే కలిగి ఉన్న నేత రాష్ట్రపతి కాలేడనే విషయం తనకు తెలుసని అన్నారు. అందువల్ల ఈ దఫా రాష్ట్రపతి పదవి కూడా ఎన్డీఏ కూటమికే దక్కుతుందన్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ ఇతర పార్టీల నేతలతో కూడా మాట్లాడితే, రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చని సూచించారు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలంటూ తాజాగా శివసేన ప్రతిపాదించింది. తాము పవార్‌కు మద్దతు ఇస్తున్నామని, తమ భాగస్వామి అయిన బీజేపీ కూడా ఆయనకు మద్దతివ్వాలని కోరింది. శివసేన పార్టీ నేత సంజయ్ రావత్ దీనిపై మాట్లాడుతూ రాష్ట్రపతి పదవిని అలంకరించడానికి పవార్ తగిన వ్యక్తి అని వ్యాఖ్యానించగా, ఆయన పై విధంగా స్పందించారు.