ఓ మహిళ ఆత్మహత్య వ్యవహారం మంత్రి మెడకు చుట్టుకుంది. దీంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మంత్రి పేరు సంజయ్ రాథోడ్. మహారాష్ట్ర అటవీశాఖా మంత్రిగా ఉన్నారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన పూజా చవాన్ (23) అనే మహిళ మంత్రి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో మంత్రి తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అందజేశారు.
బాధిత మహిళతో మంత్రి ఉన్నట్లు, మాట్లాడినట్లుగా చెబుతున్న ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మహారాష్ట్ర అటవీ మంత్రి సంజయ్ రాథోడ్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అందజేశారు.
రాష్ట్రంలో ఓ మహిళ మరణానికి సంజయ్ రాథోడ్ కారణమని ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మహిళ మరణంపై నీచ రాజకీయాలు చేస్తున్నారని సంజయ్ రాథోడ్ మండిపడ్డారు. సత్యం నిగ్గుతేలాలన్న ఉద్దేశంతోనే మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కాగా, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో రాజీనామా చేసిన తొలిమంత్రి సంజయ్ రాథోడ్.