కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్నాటక బస్సుల్లో ప్రయాణం చేశారు. మహిళలతో కలిసి ఆయన జర్నీ చేశారు. ఆదివారం డెలివరీ బాయ్‌తో కలిసి స్కూటీపై ప్రయాణం చేసి మీడియా దృష్టిని ఆకర్షించారు. సోమవారం సిటీ బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా నిత్యావసరాల ధరల పెరుగుదల, గృహలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలపై మహిళా ప్రయాణికులతో చర్చించారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు, ముచ్చటించేందుకు కాలేజీ విద్యార్థులు, మహిళలు పోటీపడ్డారు.
రాహుల్ తొలుత కన్నింగ్ హోం రోడ్డులో ఉన్న కేఫ్ కాఫీ డేలో కాఫీ తాగారు. ఆ తర్వాత బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన బస్‌స్టాఫ్‌కు చేరుకున్నారు. కాలేజీ విద్యార్థులు, మహిళలతో కలిసిపోయి వారితో మాట్లాడారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. మహిళలు, కాలేజీ విద్యార్థులతో రాహుల్ మాట్లాడారు.
నిత్యావసరాల ధరల పెరుగుదల, గృహలక్ష్మి, బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీ తదితర అంశాలపై వారితో చర్చించారు. ఆ తర్వాత లింగరాజపురం వద్ద బస్సు దిగారు. అక్కడ బస్టాప్‌లో వేచివున్నవారితో కొద్దిసేపు ముచ్చటించారు.