ఏసీ కోచ్‌ల్లో రద్దీపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ ... దుష్ప్రచారమంటున్న రైల్వే శాఖ

వరుణ్

ఆదివారం, 21 ఏప్రియల్ 2024 (10:41 IST)
ఏసీ కోచ్‌లలో అన్ రిజర్వుడ్ ప్రయాణికులు భారీగా ఎక్కేస్తున్నారు. దీంతో ఈ బోగీల్లో తీవ్రమైన రద్దీ నెలకొంటుంది. ఏసీ బోగీల్లో ప్రయాణించేందుకు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు కూడా సీట్లు ఇవ్వడం లేదు. దీంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఏసీ బోగీల్లో నెలకొన్న రద్దీని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇపుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై రైల్వే శాఖ స్పందించారు. తమపై దుష్ప్రచారం సాగుతుందంటూ అత్యంత పరిశుభ్రంగా ఉండే ఓ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 
పైగా, తెగ వైరల్ అవుతున్న వీడియోలపై కూడా స్పందించింది. అవి పాత వీడియోలని పేర్కొంది. తమ ఇమేజ్‌ను దెబ్బతీసే వీడియోలను షేర్ చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తమ ప్రతిష్ట దెబ్బతీసేలా ప్రచారం జరుగుతోందని రైల్వే శాఖ ఆరోపించింది. ఏసీ కోచ్‌లలో రద్దీ విపరీతంగా ఉందంటూ పాత, తప్పుడు వీడియోలను యూజర్లు షేర్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. వీడియోలపై ఆరా తీయగా క్షేత్రస్థాయిలో ఎటువంటి తప్పులు జరగలేదని తేలినట్టు పేర్కొంది. తాము ఒక్కో ఘటనపై సామాజిక మాధ్యమాల్లో వివరణ ఇస్తున్నామని కూడా రైల్వే శాఖ పేర్కొంది.
 
తమ ప్రతిష్టను దిగజార్చేందుకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. వీడియోల్లోని ఘటనలకు సంబంధించి ఆధారాలేవీ లభ్యం కాలేదని పేర్కొన్నాయి. ఓ వినియోగదారుడి ఫిర్యాదుపై స్పందించిన రైల్వే శాఖ.. ఏసీ కోచ్ తాజా పరిస్థితిపై ప్రకటన విడుదల చేసింది. 'ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఎక్కడా రద్దీ లేదు. దయచేసి మా ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దు. సేవాలోపాల పేరిట దయచేసి పాత వీడియోలు షేర్ చేయొద్దు. రైళ్లల్లో ప్రస్తుత పరిస్థితిని గమనించండి. భారతీయ రైల్వే ప్రస్తుతం రికార్డు స్థాయిలో అదనపు రైళ్లను నడిపిస్తోంది' అని రైల్వే శాఖ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. 
 
కైఫియత్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు రద్దీ భరించలేక కిటీకీ అద్దం పగలగొట్టినట్టు ఉన్న వీడియోపై కూడా రైల్వే స్పందించింది. అసలు ఇలాంటి ఘటనే జరగలేదని తమ అంతర్గత దర్యాప్తులో తేలిందని పేర్కొంది. తప్పుడు వీడియోలు, వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు