ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు షాక్... మూడు పిటిషన్లను డిస్మిస్ చేసిన హైకోర్టు

సోమవారం, 9 అక్టోబరు 2023 (11:15 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అంగళ్లు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్లపై సుధీర్ఘ విచారణలు జరిపిన హైకోర్టు సోమవారం కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు టీడీపీ సిద్ధమవుతుంది. 
 
ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపున హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై గత వారం సుధీర్ఘంగా విచారణలు జరిగాయి. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ఏ24గాను, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ1గాను, అంగళ్లు కేసులో ఏ1గా ఉన్నారు. అంగళ్ళు కేసులో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలకు ఇదే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఈ కేసులో ఖచ్చితంగా ముందస్తు బెయిల్ లభిస్తుందని టీడీపీ శ్రేణులు భావించాయి. 
 
కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేయడం గమనార్హం. దీంతో టీడీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. మరోవైపు, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు