రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో 51 వేల రూపాయల కట్నం తీసుకురానందుకు ఓ మహిళపై తన భర్తతో పాటు అతని ఇద్దరు సోదరులు ఇటీవల అత్యాచారనికి తెగబడిన విషయం తెల్సిందే. ఈ విషయం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ నేపథ్యంలో రేప్ బాధితురాలు జైపూర్ నార్త్ పోలీసుస్టేషనులో ఉండగా పరామర్శకు వెళ్లిన ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సుమన్ శర్మతో కలిసి కమిషన్ సభ్యురాలు సౌమ్యా గుర్జార్ సెల్ఫీ తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించ సాగారు.
దీంతో తేరుకున్న ఆమె వివరణ ఇచ్చారు. తాను అత్యాచార బాధితురాలితో మాట్లాడుతుండగా కమిషన్ సభ్యురాలు సౌమ్యా గుర్జార్ సెల్ఫీని క్లిక్‌మనిపించారని అది తాను గమనించలేదని ఛైర్పర్సన్ సుమన్ శర్మ చెప్పుకొచ్చారు. ఇలా సెల్ఫీ తీసిన సభ్యురాలు సౌమ్యా నుంచి రాతపూర్వకంగా వివరణ కోరామన్నారు. కాగా సౌమ్య సెల్ఫీ క్లిక్ మనిపిస్తున్నపుడు ఛైర్పర్సన్ సుమన్ శర్మ ఫ్రేమ్‌లో చూస్తుండటం గమనార్హం. ఈ రేప్ బాధితురాలి సెల్ఫీ ఇంటర్ నెట్లో హల్చల్ చేస్తోంది.