వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌సింగ్‌పై నమోదైన అత్యాచార కేసు తీర్పు శుక్రవారం వెలువడనుంది. దీంతో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నందున.. ఆయా రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఆయా రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రదేశాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. డేరా స్వచ్ఛ సౌదా ఆశ్రమం వద్దకు దాదాపు 40 వేల నుంచి 50 వేల వరకు మద్దతుదారులు వచ్చి చేరే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆశ్రమం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
తీర్పు సమయంలో న్యాయస్థానానికి గుర్మీత్ కూడా రానున్నారు. ఆయన వెంట అధిక సంఖ్యలో న్యాయస్థానానికి మద్దతుదారులు వచ్చే అవకాశం ఉంది. గుర్మీత్‌కు పంజాబ్, హరియాణా ప్రాంతాల్లో అధిక సంఖ్యలో మద్దతుదారులు ఉన్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని హర్యానాలో పరిస్థితిని అదుపు చేసేందుకు 35 కంపెనీలకు చెందిన పారామిలటరీ బలగాలను రంగంలోకి దించినట్లు ఆ రాష్ట్ర డీజీపీ బీఎస్.సంధు తెలిపారు. సిర్సా, ఫతేబాద్, పంచకులా జిల్లాలో భారీగా బలగాలు మోహరించాయి.