బెంగుళూరులో కోట్లాది రూపాయల పాతకరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. అదీ కూడా ఓ రౌడీ షీటర్. మాజీ కార్పోరేటర్ ఇంట్లో కావడం గమనార్హం. ఆ రౌడీషీటర్, మాజీ కార్పొరేటర్ పేరు నాగా. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడటమే కాకుండా, ఇపుడు కూడా పాతనోట్లను బలవతంగా మార్చుతున్నట్టు తేలింది. తాజాగా బయటపడిన ఈ వివరాలను పరిశీలిస్తే...
మాజీ కార్పొరేటర్ వి.నాగా అలియాస్ నాగరాజ్ నివాసంలో భారీ మొత్తంలో పాత కరెన్సీ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా రూ.100 కోట్ల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అంతకు ముందు తాళం వేసి ఉన్న ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు లాక్ పగలగొట్టి లోనికి వెళ్లగా, అక్కడ గదుల్లో పెద్ద ఎత్తున నగదు గుట్టలుగా పడి ఉండటాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.
అనంతరం ఆ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. ఇపుడు బయటపడిన నోట్లన్నీ పాత రూ.500, రూ.1000 నోట్లే కావడం గమనార్హం. పేరుమోసిన రౌడీ షీటర్‌గా చెలామణి అయిన నాగా... అనేక దందాలు, సెటిల్మెంట్లు, కిడ్నాప్‌లు, హత్యలు చేసిన ఈ కోట్లు కొల్లగొట్టినట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. నాగా భార్యను పోలీసులు అదుపులోకి తీసుకోగా, నాగా మాత్రం పారిపోయాడు.