శశికళకు సుప్రీంకోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. ఆమె గడువు కావాలన్న అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో చేసేదేమీ లేక శశికళ పోయెస్ గార్డెన్ నుంచి బెంగళూరుకు బయల్దేరారు. మార్గ మధ్యంలో ఆమె జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఆ సమయంలో శశికళ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనలోని ఆవేదనను, అసహనాన్ని బాహాటంగా చాటి చెప్పారు. జయలలిత సమాధిపై చేత్తో మూడు సార్లు నమస్కరించి.. ఆ తర్వాత వంగి సమాధిపై గట్టిగా కొడుతూ శపథం చేశారు.
ఆమె ఆ సమయంలో ఏదో మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారనే విషయంపై స్పష్టత లేదు. అమ్మ సమాధి వద్ద శశికళ మునుపెన్నడూ ఇంతవింతగా ప్రవర్తించలేదు. ఆమె ప్రవర్తన చూసి పక్కన ఉన్న ఆమె అనుచరులు నినాదాలు చేశారు. ఆమె శపథం చేసే సమయంలో ముఖమంతా రౌద్రంగా మారిపోయింది. ఆమె ఎవరిపై తన కోపాన్ని వెల్లగక్కారో తెలియలేదు. మొత్తంమీద సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ 'కసి'కళగా మారిపోయింది.