ఏపీఎంసీలను (మండీలు) మరింత బలోపేతం చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. మండీలకు మరిన్ని వనరులను అందించడానికి తాము సిద్ధమని, అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ విస్తరణ జరిగిన తర్వాత కేబినెట్ సమావేశం జరగడం ఇదే ప్రథమం. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ మాట్లాడుతూ... ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ కింద మండీలకు లక్ష కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు తోమర్ ప్రకటించారు.
నూతన సాగు చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని తోమర్ పునరుద్ఘాటించారు. సాగు చట్టాల వల్ల మండీలకు వచ్చే నష్టమేమీ లేదని, నూతన సాగు చట్టాల అమలు వల్ల మండీలకు కోట్ల రూపాయల లాభం వస్తుందన్నారు. దేశ వ్యవసాయ రంగంలో కొబ్బరి సాగు కీలక పాత్ర పోషిస్తోందని, అందుకే తాము కొకొనట్ బోర్డు యాక్ట్‌ను సవర్తిస్తున్నామని ప్రకటించారు.
కొబ్బరి బోర్డుకు అధికారులు ఉండరని, వారి స్థానంలో వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చేవారు బోర్డు అధ్యక్షుడిగా ఉంటారని పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా కొబ్బరి క్షేత్రాన్ని మరింత జీర్ణించుకొని, మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని తోమర్ అభిప్రాయపడ్డారు. ఈ బోర్డులో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను సభ్యులుగా చేరుస్తున్నామని తోమర్ ప్రకటించారు.