దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతుంది. ఆడబిడ్డలంటేనే కడుపులోనే భ్రూణ హత్యలు, ఒకవేళ పుట్టినా కామాంధుల చేతిలో వేధింపులు.. అత్యాచారాలకు గురవుతున్నారు. బాలికల నుంచి వృద్ధ మహిళలపై కూడా కామాంధులు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో బాలికల అక్రమ రవాణాపై జాతీయ మానవ హక్కుల కమిషన్ షాక్నిచ్చే వివరాలను బయటపెట్టింది.
2014లో వెల్లడైన నివేదిక ఆధారంగా ప్రతి సంవత్సరం.. 40వేల మంది బాలికల అక్రమ రవాణా జరుగుతున్నట్లు వెల్లడించింది. ఇలా అక్రమ రవాణాకు గురైన వారిని భిక్షాటనకు, వేశ్యా గృహాలకు తరలిస్తున్నారని తెలిపింది. నాలుగేళ్ల బాలికల నుంచి ఆ పైబడిన వారు అక్రమ రవాణాకు బలవుతున్నారని ఎన్హెచ్ఆర్సి వెల్లడించింది. కేంద్రం తక్షణమే దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది.
ఇలా అక్రమ రవాణాకు గురైన వారిలో 11 వేల మంది ఆచూకీ ఏమాత్రం లభించట్లేదని, ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక బాలిక అపహరణకు గురవుతున్నట్లు తమ వద్ద నివేదిక ఉందని జాతీయ మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. ఈ సమస్యను తెలికగా తీసుకుంటే రాబోయే రోజులలో మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని కమిషన్ హెచ్చరించింది.