యూపీలోని ఓ హెల్త్ సెంటర్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెళ్లిన ముగ్గురు మహిళలకు.. అక్కడి హెల్త్ సెంటర్ సిబ్బంది రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం కలకలం రేపింది. రాబిస్ టీకా తీసుకున్న ముగ్గురిలో ఒకరు అనారోగ్యం పాలవడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలోని కంధాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సరోజ్ (70), అనార్కలి (72), సత్యవతి (60) అనే ముగ్గురు మహిళలు కలిసి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకునేందుకు ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. వెంటనే అక్కడి వైద్య సిబ్బంది ఒక్కొక్కరితో రూ. 10 సిరంజిలు కొనిపించారు. అనంతరం వారికి కరోనా వ్యాక్సిన్ బదులు రేబిస్ టీకాలు వేసి పంపించారు.
అయితే.. టీకా వేయించుకుని ఇంటికి వెళ్లిన సరోజ్‌కు మత్తుగా, అసౌకర్యంగా ఉన్నట్టు అనిపించింది. ఆమె అదో రకంగా ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యుడు ఆమెకు రేబిస్ టీకా వేసినట్టు గుర్తించాడు. దీంతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ వేసిన సిబ్బందిపై మండిపడ్డారు.