భార్య కాపురానికి రాలేదనీ బావమరిదిని కిడ్నాప్ చేసిన భర్త...
మంగళవారం, 5 జూన్ 2018 (09:51 IST)
భార్య కాపురానికి రాకపోవడంతో ఆగ్రహించిన భర్త... తన బావమరిదిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
ఫిరోజాబాద్ జిల్లా రసూల్‌పురా గ్రామానికి చెందిన సౌరభ్ (29), రత్నేష్ (27) అనే దంపతులు ఉన్నారు. ఈ భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు ఏర్పడుతున్నాయి. దీంతో భర్త వేధింపులను తట్టుకోలేక భార్య రత్నేష్ పుట్టింటికి వెళ్లి పోయింది.
ఆ తర్వాత అత్తారింటికి వెళ్లిన సౌరభ్... కాపురానికి రాకుంటే తీవ్రపరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించడమేకాకుండా తన బావమరిది దేవేంద్రను కిడ్నాప్ చేశాడు. బావమరిదిని కిడ్నాప్ అతన్ని తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న రత్నేష్ పోలీసులను ఆశ్రయించింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దేవేంద్రను ఢిల్లీ రైల్వేస్టేషనులో గుర్తించి కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. నిందితుడైన సౌరభ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.