వేలూరు జిల్లా కె.వి.కుప్పం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద నివాసముంటున్న కాలన్న నాయుడు ఇంటి వద్ద అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ముగ్గురు యువకులు ఇంటిని చుట్టుముట్టారు. తమ ఇంటి వద్ద దొంగలు వచ్చారని గమనించిన కాలన్న నాయుడు గ్రామంలోని తమ బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు కాలన్న నాయుడు ఇంటికి చేరుకొని ఒక యువకుణ్ణి పట్టుకుని చెట్టుకు కట్టేశారు.
ఇంతలో మరో ఇద్దరు యువకులు రాళ్లతో దాడికి యత్నించగా గ్రామస్తులు ఇద్దరు యువకులను పట్టుకునేందుకు ప్రయత్నించగా చీకట్లో వారు పరారయ్యారు. దొంగలు రాళ్లతో కొట్టేందుకు ప్రయత్నించడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు చెట్టుకు కట్టేసిన యువకుడిని చితక్కొట్టి చంపేశారు. విషయం తెలుసుకున్న కె.వి. కుప్పం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.