వెనుబడిన జాబితాలోని యాదవ కులానికి చెందినప్పటికీ తన కూతురికి రిజర్వేషన్ అవసరం లేదని ఒక వెబ్ సైటుకు ఇచ్చిన ఇంటర్య్యూలో చెప్పిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ ఎన్నికల తొలిదశ పోలింగుకు ముందు పెద్ద బాంబు పేల్చారు. కులం తర్వాతే అన్నీ పుట్టుకొచ్చే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ తన వ్యాఖ్యలతో కలకలం రేపారు.
ములాయం చిన్న కోడలు చేసిన ఈ ప్రకటన వెనువెంటనే బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఓబీసీలు, నిమ్నకులాలపై నిజంగా సమాజ్ వాదీ పార్టీకి ప్రేమ ఉంటే ఆమెపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. అపర్ణ యాదవ్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి ఉమాభారతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యాదవ కులంలో ఎంతో మంది వెనుకబడినవారు ఉన్నారని తెలిపారు.
తొలిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడిన అపర్ణ యాదవ్.. లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. వెనుకబడిన కులాల్లోనూ సంపన్నులుగా మారిన వారికి కులం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎందుకు అన్న ప్రశ్న వాస్తవానికి చాలా న్యాయమైన ప్రశ్న. క్రీమీలేయర్‌కు రిజర్వేషన్లు తీసివేయాలని దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్న చర్చకు ములాయం చిన్న కోడలు ప్రకటన ఒక రకంగా నైతిక సమర్థన ఇచ్చింది.