పవన్‌ మాటలు నన్ను హత్తుకున్నాయ్: నరేంద్ర మోడీ!

మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (16:29 IST)
File
FILE
ఈ ఎన్నికలు తెలంగాణకు ఎంతో కీలకమైనవని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మంగళవారం నిజామాబాద్ సభలో అన్నారు. కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణ రాష్ట్రానికి మంచి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ బహిరంగ సభలో ఆయన ఇంకా మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆకాశానికెత్తేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాటలు తనను హత్తుకున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ వంటి వారు తెలుగు స్ఫూర్తిని కాపాడగలరని పూర్తిగా విశ్వసిస్తున్నానని చెప్పారు.

ఇకపోతే ఎందరో బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ భాగ్యరేఖను మార్చుతామని హామీ ఇచ్చారు. ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల తెలంగాణ రాలేదన్నారు. ప్రజల ఉద్యమం వల్ల వచ్చిందన్నారు. వందలమంది ప్రాణాలు బలిదానాలు చేసుకున్నారని, అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిద్దామా అన్నారు.

తెలంగాణ ప్రజల పైన నమ్మకంతో తాను ఇక్కడ అడుగు పెట్టానని చెప్పారు. రానున్న ఐదేళ్లలో తెలంగాణ సమస్యలన్నింటిని పరిష్కరిస్తామన్నారు. తెలంగాణను ఎవరి చేతుల్లోనో పెడితే ఏమవుతుందోననే ఆందోళన ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని చూస్తే ఆ పార్టీని నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదన్నారు. తెలంగాణ ప్రజలను గౌరవించాలని కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.

ఏ వ్యక్తి ఆర్థిక సంస్కరణల వల్ల కాంగ్రెసు పార్టీ, దేశం నిలబడిందో.. ఆ పీవీనే కాంగ్రెస్ పార్టీ విస్మరించిందన్నారు. కనీసం గౌరవించడం లేదన్నారు. ఎంతోమంది నిజామాబాద్ యువకులు గల్ఫ్‌కు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడే ఉపాధి దొరికితే ప్రజలు గల్ఫ్‌కు వెళ్లే పని ఉండదన్నారు.

వెబ్దునియా పై చదవండి