జగన్మోహన్ రెడ్డికే పట్టం కట్టాలి: అక్కినేని నాగార్జున

శనివారం, 5 సెప్టెంబరు 2009 (17:34 IST)
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లక్ష్యాలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికే సీఎం బాధ్యతలు అప్పగించాలని సినీ హీరో అక్కినేని నాగార్జున అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ హఠాన్మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయాలంటే ఆయన తనయుడు, కడప ఎం.పి. జగనే సమర్థుడన్నారు.

తన కుమారుడు నటించిన "జోష్" చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా శనివారం విడుదలైంది. ఈ సందర్భంగా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను, కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళాలంటే, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే యువకుడు, విద్యావంతుడు, చైతన్యవంతుడైన జగన్మోహన్ రెడ్డికే బాధ్యతలు అప్పగించాలన్నారు.

కాగా, తన కుమారుడు నటించిన "జోష్" చిత్రాన్ని వైఎస్‌కు అంకితం చేస్తున్నట్టు చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యంత ప్రతిభావంతుడైన ప్రజా నాయకుడని, ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డిలోనూ అలాంటి ఆలోచనలు, భావాలున్నాయన్నారు. జగన్‌ కూడా వైఎస్‌లా దూరదృష్టి కలిగిన నేతగా నాగార్జున కితాబిచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని నాగార్జున గుర్తు చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి