తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో ఆయనకే తెలియదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. ఈ విషయంపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజానాయకులు.. ఎవరైనా ప్రజల మనోభావాలు దెబ్బతినకండూ మాట్లాడాలని చిరు సూచించారు.
గ్రేటర్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చిరంజీవి తెలిపారు. అలాగే స్థానిక ఎన్నికల్లో పొత్తులుండవని, కానీ ఎవరైనా ముందుకు వస్తే కలవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
వరద బాధితుల సహాయార్థం రూ. 2 లక్షలను సింబయసిస్ ఉద్యోగులు చిరంజీవికి అందజేశారు. వరద బాధితుల సహాయార్థం చిరంజీవి విశాఖలో జోలె పట్టనున్నారు.
ఈ సందర్భంగా చిరు మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితుల సహాయార్థం జోలె పట్టనున్న తనకు చేయూతనివ్వాల్సిందిగా పిలుపు నిచ్చారు. వరద మానవ తప్పిదమేనని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగని విధంగా స్పందించలేదన్నారు.
వరద నష్టం అంచనా వేసేందుకు ఇంతవరకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించలేదని చిరంజీవి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రోశయ్య సామర్థ్యంపై తనకెలాంటి అనుమానం లేదని, అయితే ఆయన మరింత కఠిన వైఖరిని అవలంభించాలన్నారు.