చిరంజీవి సినిమాల్లోనే హీరో.. బయట కాదు: మల్లోజుల

శనివారం, 24 అక్టోబరు 2009 (12:47 IST)
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కేవలం వెండితెరపైన మాత్రమే హీరో అని, బాహ్య ప్రపంచంలో కాదని మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర రావు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఓ దొంగగా ఆయన చిత్రీకరించారు. తన రాజకీయ భవిష్యత్ కోసం తెలంగాణా సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు.

పశ్చిమబెంగాల్ అడవుల్లో ఉన్న మల్లోజులను ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఇందులో ఆయన రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుత రాజకీయాలకు సినీ హీరో చిరంజీవి ఏమాత్రం సరిపోరన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డిని ప్రజా కోర్టులో శిక్షించాలని భావించామన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆ అవకాశం మాకు దక్కలేదన్నారు. అయితే, తమ కేడర్‌ను దారుణంగా హతమార్చిన చోటే వైఎస్ దుర్మరణం పాలుకావడం తమకు కొంత ఊరటనిచ్చిందన్నారు.

తమకు అజెండాలో ఏ ఒక్కరూ టార్గెట్‌గా ఉండబోరని స్పష్టం చేశారు. నందిగ్రామ్ నరమేథం జరుగకుండా ఉండివుంటే బెంగాల్ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు వృద్ధనేత బుద్ధదేవ్ భట్టాచార్య (బుద్ధబాబా) తమ టార్గెట్‌లోకి వచ్చి ఉండేవారు కాదన్నారు.

అలాగే, చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ప్రపంచ బ్యాంకుకు ఆంధ్ర సీఈఓగా మారకుంటే ఆయనపై దాడి చేసి ఉండేవారిమి కాదన్నారు. ఎన్.జనార్ధన్ రెడ్డి నక్సలైట్లపై ఉక్కుపాదం మోపడం వల్లే ఆయనను టార్గెట్ చేసి దాడి చేశామన్నారు.

ఇకపోతే.. తాజాగా ఫ్రీజోన్‌పై కూడా మల్లోజుల తన స్పందనను వ్యక్తం చేశారు. దీనిపై తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు రాద్ధాంతం చేయడం కేవలం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల స్టంటేనని తెగేసి చెప్పారు. ఆయన డబ్బు సంపాదన కోసమే తెరాసను నడుపుతున్నారని మల్లోజుల ధ్వజమెత్తారు.

వెబ్దునియా పై చదవండి