రాష్ట్ర రాజధాని నిమ్స్‌లో ఎంపీ లగడపాటి!

సోమవారం, 21 డిశెంబరు 2009 (17:10 IST)
రాష్ట్ర రాజకీయ నేతల్లో నిజమైన హీరోగా విజయవాడ లోక్‌సభ లగడపాటి రాజగోపాల్ మారారు. తెలంగాణవాదులు తమ రాష్ట్ర రాజధానిగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌కు పోలీసుల కన్నుగప్పి చేరుకోవడం ఓ సాహసోపేతమైన చర్యలాంటింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా లగడపాటి లాంటి వివాదాస్పద నేత సినీ ఫక్కీలో రాజధానిలోని నిమ్స్‌కు చేరుకోవడం రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్నే విస్మయానికి గురిచేసింది.

లగడపాటిని తెలంగాణతో పాటు హైదరాబాద్ గడ్డపై కూడా అడుగుపెట్టనీయమని తెలంగాణ వాదులంతా ముక్తకంఠంతో హెచ్చరిస్తున్న తరుణంలో లగడపాటి ఎవరి కంటపడకుండా హైదరాబాద్‌లోని నిమ్స్‌కు చేరుకోవడం గమనార్హం. సమైక్యాంధ్ర ఉద్యమంలో తన ప్రాణాలు బలిపెట్టేందుకు సైతం సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన తొలి రాజకీయ నేత లగడపాటి కావడం గమనార్హం.

అంతేకాకుండా తెలంగాణకు సానుకూలంగా కేంద్ర ప్రకటన చేసిన మరుక్షణమే తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి విషయం తెల్సిందే. ఆ తర్వాత రాయలసీమ, కోస్తాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాల బాట పట్టారు. దీంతో తెలంగాణ ఏర్పాటుకు రాజగోపాల్ మోకాలడ్డుతున్నారని, ఆయనపై దాడి చేస్తామని తెరాసతో పాటు.. ఇతర తెలంగాణ వాదులంతా హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెల్సిందే.

ఇలాంటి నేపథ్యంలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని చికిత్స చేయించుకునేందుకు నిమ్స్ తరలించాలని లగడపాటి డిమాండ్ చేస్తున్నారు. అయితే, రాజగోపాల్‌ను తరలించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో లగడపాటే స్వయంగా హైదరాబాద్‌లోని నిమ్స్‌కు చేరుకోవడం ప్రస్తుత రాజకీయాల్లో నిజమైన రాజకీయ నేతగా మారారు.

వెబ్దునియా పై చదవండి