మన దృష్టి అభివృద్ధిపై.. కేంద్రం చూపు తెలంగాణపై: సీఎం
సోమవారం, 18 జనవరి 2010 (17:10 IST)
రాష్ట్ర అభివృద్ధిపై మనం ప్రత్యేక దృష్టిసారిద్ధాం. తెలంగాణ అంశాన్ని కేంద్రం చూసుకుంటుంది.. అని ముఖ్యమంత్రి కె.రోశయ్య సహచర మంత్రువర్యులతో అన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ అంశంపై కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ప్రతి ఒక్కరం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిద్ధామన్నారు. అప్పటి వరకు మంత్రులు తమ మనస్పర్ధలను పక్కన పెట్టి గురుతర బాధ్యతతో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.
కాగా, ఈ సమావేశంలో తెలంగాణ అంశంతో పాటు.. పంటల బీమా, సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చించారు. అలాగే, ఉపాధి హామీ పథకాల అమలు తీరుతెన్నులపై కూడా మంత్రివర్గం సమగ్రంగా చర్చించినట్టు సమాచారం. వీటితో పాటు.. ద్విచక్ర వాహనాలు మినహా అన్ని రకాల వాణిజ్య వాహనాలపై రెండు శాతం పన్ను విధించాలని రాష్ట్ర మంత్రి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.
అలాగే, చిత్తూరు జిల్లాలో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆర్థిక సమాఖ్యల ద్వారా 200 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు సహాయంగా ఇచ్చేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆరు చక్కెర కర్మాగారాలకు వర్కింగ్ క్యాపిటల్ గా 8.16 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేబినెట్ తీర్మానించింది. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఇఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.