బోరు బావిలో పడిన మహేష్ మృతి చెందాడు. ఏడేళ్ళ బాలుడిని సజీవంగా రక్షించేందుకు వరంగల్ జిల్లా అధికార యంత్రాంగంతో పాటు.. ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. బోరుబావిలో పడేటపుడే తలకిందులు పడటం వల్ల బాలుడు మృతి చెందినట్టు వైద్యులు చెపుతున్నారు.
వరంగల్ జిల్లా తొర్రూరు మండలం పోలెపల్లి శివారు చంద్రుతాండాకు చెందిన ధరావత్ మహేష్ ప్రమాదవశాత్తు 35 అడుగుల బోరు బావిలో పడిన విషయం తెల్సిందే. ఆ బాలుడి ప్రాణాలు కాపాడేందుకు జిల్లా యంత్రాంగం గత 24 గంటల పాటు శ్రమించినా మహేష్‌ను రక్షించలేక పోయింది.
అప్పులు చేసి తవ్వించిన బోరుబావే తమ ఆశాజ్యోతి ప్రాణాలు తీయడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మహేష్ మరణ వార్త తెలియడంతో చంద్రుతాండాలో విషాద ఛాయలు అలముకున్నాయి. అలాగే, ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు కూడా కళ్లు చెమర్చారు.