అసలు ఎవడీ సత్యారెడ్డి..? ఎక్కడా చూసింది లేదే..!: గోపాల్
జగన్ యువసేన అధ్యక్షడంటూ మీడియా ముందుకు వచ్చి, అంబటి రాంబాబుపై విమర్శల వర్షం కురిపించిన సత్యారెడ్డిని ఇంతకు ముందు మేముప్పుడూ చూడలేదని నెల్లూరు నేత గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్‌ను చూసేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదంటూ అంబటి రాంబాబుపై విరుచుకుపడిన సత్యారెడ్డి ఎవ్వడో మాకు తెలియదని గోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు.
జగన్ వెన్నంటి ఉండే తాము ఇంతవరకు సత్యారెడ్డి చూసింది లేదని, ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం వ్యూహమని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్ కుటుంబంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలా చిచ్చుపెట్టిందో.. అదేవిధంగా జగన్ అభిమానుల మధ్య విభేదాలు సృష్టించేందుకే సత్యారెడ్డి పేరిట అధిష్టానం దుష్ప్రచారం చేస్తుందని గోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు.
కాగా వైయస్ జగన్ యువసేనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ అధ్యక్షుడు సత్యారెడ్డిపై వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు భగ్గుమంటున్నారు. వైయస్ జగన్ యువసేన ఎప్పుడో రద్దయిందని వారంటున్నారు. వైయస్ జగన్ యువసేనలంటూ ఏవీ లేవని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) మాజీ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు.