అఖిలపక్ష సమావేశంపై భగ్గుమంటున్న టి కాంగ్రెస్ నేతలు!!
సోమవారం, 3 జనవరి 2011 (12:03 IST)
ఈనెల 6వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఈ సమావేశం వల్ల ఒనగూరే ప్రయోజనం శూన్యమని వారు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ఈ భేటీకి వెళ్లినా.. వెళ్ళక పోయినా ఒక్కటేనని వారు అంటున్నారు.
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఆదివారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందులో పలువురు నేతలు పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అభివృద్ధి ఒప్పందాలు, ప్రత్యేక ప్యాకేజీలు, రాజ్యాంగ రక్షణల్లాంటి ప్రత్యామ్నాయాలు వంటివి అంగీకరించకూడదనన్నారు. ప్రత్యేక రాష్ట్రమే తమ లక్ష్యమంటూ తేల్చిచెప్పాలని వారు తీర్మానించారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా లేకపోతే ఈ నెల 6న ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశం నుంచి వాకౌట్ చేయాలని కూడా నిర్ణయించడం కొసమెరుపు. అంతేకాకుండా, వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టే పరిస్థితి లేకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంపైనా సుదీర్ఘంగా చర్చించినప్పటికీ.. దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేక పోయారు.
ఇదే అంశంపై ఈనెల ఆరో తేదీన ఎమ్మెల్యేలు, ఏడో తేదీన ఎంపీలు సహా ముఖ్యమైన నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణకు తుదిరూపు ఇవ్వాలని తీర్మానించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోకూడదంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయాలన్న దానిపై కూడా చర్చించారు. కేంద్రం తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సింది పోయి ఇప్పుడు మళ్లీ చర్చల కోసం సమావేశాలు పెట్టడం ఎందుకని కొందరు సభ్యులు మండిపడ్డారు.