గత యేడాది సెప్టెంబరులో జరిగిన ఆందోళన సమయంలో హైకోర్టు విధులకు ఆటంకం కలిగించిన పలువురు తెలంగాణ నేతలతో పాటు న్యాయమూర్తులకు కోర్టు ధిక్కరణ నోటీసులను సుప్రీంకోర్టు జారీ చేసింది. ఈ నోటీసులపై రెండు వారాల్లో సమాధానం తెలపాలని కోర్టు ఆదేశించింది
తెలంగాణ ఉద్యమంలో భాగంగా గత సెప్టెంబరు నెలలో పలువురు తెలంగాణ నేతలు హైకోర్టు జస్టీస్ నాగార్జున రెడ్డి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ కార్యకలాపాలను అడ్డుకున్న విషయం తెల్సిందే. దీనిపై మనస్తాపం చెందిన నాగార్జున రెడ్డి తన పదవికి కూడా రాజీనామా చేయగా, చీఫ్ జస్టీస్ జోక్యంతో ఇది సద్దుమణిగింది. ఈ కోర్టు విధులకు ఆటంకం కలిగించడాన్ని ఖండిస్తూ ముగ్గురు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీం.. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించింది.
కోర్టు ధిక్కరణ కింద తెరాస అధినేత కేసీఆర్, ఎంపీ విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే నాయిని నర్శింహారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీలతో పాటు.. బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ నేతలకు, ఆందోళనలతో సంబంధం ఉన్న హైకోర్టు న్యాయవాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం వివరణ ఇవ్వాలని గడువు విధించింది. సెప్టెంబరులో హైకోర్టు ప్రాంగణంలో చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించి అన్ని వీడియోలను కోర్టు ముందు ఉంచాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.