హైదరాబాద్‌ ఉన్న తెలంగాణానే కోరుకుంటున్నాం: ఉత్తమ్

బుధవారం, 5 జనవరి 2011 (16:06 IST)
తెలంగాణలోని మెజారిటీ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నారని ఆ ప్రాంతం తరపున కాంగ్రెస్ ప్రతినిధి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మెజారిటీ ప్రజలు రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నారన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని భావిస్తున్నారన్నారు.

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ప్రతులను అందజేసేందుకు హోం మంత్రి చిదంబరం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉంటారని తాను భావిస్తున్నట్టు చెప్పారు. నివేదికను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత తమ అభిప్రాయాలను వెల్లడిస్తామన్నారు.

అఖిలపక్ష సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి బహిష్కరించకుండా ఉండాల్సిందని అన్నారు. మెజారిటీ ప్రజల అభిప్రాయం తెలంగాణకు అనుకూలంగా ఉన్నందున తెరాస కూడా ఈ సమావేశానికి హాజరై వుంటే బాగుండేదన్నారు.

రేపటి సమావేశం అనంతరం ఈనెల 20వ తేదీ ప్రాంతంలో మరో సమావేశం ఉంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనిపై స్పష్టమైన సమాచారం తనకు లేదన్నారు. అంతేకాకుండా, జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సూచించి పరిష్కార మార్గాల్లో ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఉంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి