చిరు ఫిల్మ్‌కు బ్రేక్: ప్రస్తుతానికి రాజకీయాలపైనే దృష్టి..!?

శుక్రవారం, 7 జనవరి 2011 (14:16 IST)
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన కొత్త చిత్రానికి తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణాలను గమనిస్తుంటే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరగవచ్చుని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీంతో రాజకీయాలపై మరింత దృష్టి కేంద్రీకరించాలని చిరంజీవి భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కంటే రాజకీయ రంగంలో పాజిటివ్ సిగ్నల్స్ ఎక్కువగా ఉన్నాయని చిరు భవిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తన 150 చిత్రానికి కొద్ది కాలం విరామం ప్రకటించినట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఈ ఫిబ్రవరిలోనే చిరు చిత్రం ప్రారంభం కావాల్సి ఉంది.

కానీ.. రాష్ట్రంలో తెలంగాణా అంశంపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక అనంతరం రాజకీయ స్థితిగతులు రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలే అంతమాత్రంగా ఉన్న తన పార్టీని మరింత బలోపేతం చేసుకొని, ఒకవేళ మధ్యంతరమే వస్తే ఎలా ప్రతిస్పందించాలోనని భారీ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో కొత్త సినిమా గురించి మరో ఆరు నెలల తర్వాత ఆలోచిద్దామని మెగాస్టార్ తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. దీంతో త్వరలోనే వెండి తెరపై మరోసారి చిరును చూద్దామనుకున్న సగటు అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

వెబ్దునియా పై చదవండి