చంద్రబాబు నాయుడుకి తనకు మధ్య భేదాభిప్రాయాలున్నట్లు కొన్ని ఛానళ్లు పనిగట్టుకుని ప్రచారం చేశాయని నాగం జనార్థన్ రెడ్డి మీడియాపై చిందులేశారు. ఏ ఆధారాలు చూసుకుని ఇటువంటి దుష్ప్రచారం చేశారో తనకైతే అర్థం కాలేదన్నారు.
నిజానికి వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాద ఘటన సమయంలోనే "వైఎస్సార్ హెలికాఫ్టర్ దిగి అడవిలో నడుచుకుంటూ వెళుతున్నారనీ, ఇదిగో తిరుపతివైపు రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నారని పిచ్చి వార్తలిచ్చినప్పుడే తనకు ఛానళ్లపై నమ్మకం పోయిందన్నారు. అదే ఇంగ్లీషు ఛానళ్లు అలాంటి అసత్యపు వార్తలు ప్రసారం చేయలేదనీ, ఆ ఛానళ్లను చూసైనా తెలుగు ఛానళ్లు పద్ధతి మార్చుకోవాల"న్నారు.
ఇంతలో ఓ విలేకరి కల్పించుకుని... మీరు మీ ఇంట్లో తెలంగాణా ప్రాంత నేతలతో ప్రత్యేకంగా సమావేశం ఎందుకయ్యారని ప్రశ్నించగా... నాగం స్పందిస్తూ... ఏమయా...? మా ఇంట్లో కూచుని మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదా ఏంటి..? అని ప్రశ్నించారు.
అనంతరం మాట్లాడుతూ.... తెలంగాణా ప్రాంత నాయకుల్లో స్వార్థం పెరిగిపోయిందనీ, అందువల్లనే కలిసికట్టుగా ముందుకు రావడం లేదని విమర్శించారు. తెలంగాణా సాధించాలంటే పార్టీలు మరిచి అంతా మూకుమ్మడిగా ముందుకు ఉరకాలన్నారు. ఈ విషయంలో సీమాంధ్ర నాయకుల ఐకమత్యం భేష్ అంటూ కొనియాడారు.