ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమాలు తుపాకీ నీడలో జరుగుతున్నాయి. సీఎం ఆశీనులయ్యే సభా వేదిక చుట్టూ భారీ ఎత్తున పోలీసులను మొహరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జరిగే రచ్చబండ కార్యక్రమాలు, బహిరంగ సభల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.
గత రెండు మూడు రోజులుగా సాగుతున్న ఈ రచ్చబండ కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతంలో ఆది నుంచి ఆటంకాలు ఎదురవుతున్న విషయం తెల్సిందే. ముఖ్యమంత్రి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పర్యటన సందర్భంగా ఆయా ప్రాంతాలలోని తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ అరెస్టులపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రజా సమస్యల పరిష్కరించేందుకు గాను రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వస్తుంటే.. ప్రజలను అరెస్టు చేయడం ఏమిటని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలావుండగా, వరంగల్ జిల్లా రంగశాయిపేటలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్యను భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్ అడ్డుకొని జై తెలంగాణ నినాదాలు చేశారు. నల్లగొండ, కరీంనగర్ తదితర జిల్లాల్లో అధికారులు రచ్చబండ దగ్గరకు వెళ్లకుండా ప్రజలు అడ్డకున్నారు.