కనుచూపు మేరలో తెలంగాణ రాష్ట్రం : టి ఎంపీల జోస్యం

బుధవారం, 9 నవంబరు 2011 (16:49 IST)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుచూపు మేరలో ఉందని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు జోస్యం చెప్పారు. తెలగాణ సాధన కోసం మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష బుధవారం విరమించుకున్న విషయం తెల్సిందే.

ఈ సందర్భంగా టి ఎంపీలు కె.కేశవరావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ.. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలతో తెలంగాణ వస్తుందని తేలిపోయిందన్నారు. మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే అవకాశముందన్నారు.

ఒకవేళ స్పష్టమైన ప్రకటన వెలువడకపోతే పార్లమెంటు సమావేశాలకు వెళ్లాలా వద్దా అనే విషయాన్ని చర్చించి నిర్ణయిస్తామన్నారు. అవసరమైతే పార్టీతో పాటు.. తమ ఎంపీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేస్తారని ఎంపీ కోమటిరెడ్డి ప్రకటించారు.

రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు. ఆజాద్ తాజా ప్రకటన రాష్ట్రం ఏర్పాటుపై నమ్మకం కలిగిస్తోందని, మీడియా వార్తలతో తమకు సంబంధం లేదన్నారు. తెలంగాణ కోసం పదవులు వదులుకునేందుకు కూడా సిద్ధమని మరో ఎంపీ కేకే తెలిపారు.

వెబ్దునియా పై చదవండి