నేను దివాకర్ రెడ్డిని కాదు.. ఆయన పెద్దమనిషి : ప్రభాకర్

శనివారం, 31 డిశెంబరు 2011 (17:04 IST)
తాను జేసీ దివాకర్ రెడ్డిని కాదని, ఆయన పెద్ద మనిషి అని అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ జిల్లాలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, మంత్రి శైలజానాథ్‌ వర్గానికి మధ్య చెలరేగిన వివాదాలు రచ్చకెక్కాయి. తమ రాజకీయాలకు ఓ చిరు ఉద్యోగికి నోటీసు ఇవ్వడాన్ని ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో దమ్ముంటే తనతోనే తలపడాలని ఆయన సవాల్ విసిరారు.

ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ మంత్రి శైలజానాథ్‌ గానీ లేదా పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డిగానీ జిల్లాకు చేసిన ఒక్క మంచి పని ఏమిటని ప్రశ్నించారు. సుబ్బరాయ సాగర్‌లో పూడికను తొలగించిన అధికారికి నోటీసులు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. పూడిక తీస్తే నోటీసులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

మంత్రి శైలజానాథ్, వెంకట్రామిరెడ్డిలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. పూడిక తీసినందుకు ఓ ఉద్యోగికి నోటీసులు ఇవ్వడం కాదని దమ్ముంటే తనతో తలపడాలని సవాల్ విసిరారు. అంతేకాకుండా, తాను మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డిని కాదని, ఆయన పెద్ద మనిషి అని చెప్పారు.

ఇకపోతే.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం ఎవరో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తాను వివరిస్తాన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రఘువీరా రెడ్డి జేసీబీ నడిపారని ఆయన విమర్శించారు. సుబ్బరాయ సాగర్ నీటి విడుదల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు ముదిరిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి