నవంబర్ 1 లోపే తెలంగాణ నోట్ రెడీ చేయండి.. లేట్ చేయొద్దు!

FILE
ఆంధ్ర, తెలంగాణ విలీనంతో ఆంధ్రప్రదేశ్ అవతరించిన నవంబర్ 1 లోపే.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ఒక కొలిక్కి తెచ్చి కేబినెట్ సమావేశంలో బిల్లు ఆమోదించేందుకు తెలంగాణ నోట్‌ను సిద్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించినట్లు తెలుస్తోంది.

దీని ప్రకారం మరో 40 రోజుల్లో తెలంగాణ నోట్ సిద్ధం కావాల్సిందేనని సోనియా గాంధీ నేతలకు స్పష్టం చేస్తూ.. ఆంటోనీకి బాధ్యతలు అప్పగించినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.

తెలంగాణ నోట్‌ను హోంశాఖ నుంచి న్యాయశాఖకు పంపే విషయంలో, అక్కడి నుంచి కేబినెట్‌కు అందే విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ ప్రక్రియను ఎంత వేగంగా చేపట్టినా.. కనీసం నలభై రోజులు పడుతుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ సోనియా, ఇతర నేతలకు వివరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ ఒకటికి ముందే విభజన ప్రక్రియను ఒక కొలిక్కి తేవాలని పూర్తి చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నట్లు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

శుక్రవారం సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నేతలతో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ప్రధానంగా హైదరాబాద్‌పై హక్కు కోసమే సీమాంధ్ర నేతలు పట్టుబట్టారని ఆంటోనీ కమిటీ కోర్ కమిటీలో మేడమ్‌కు చెప్పినట్లు తెలిసింది. దిగ్విజయ్, షిండే ఢిల్లీకి తిరిగివచ్చిన తర్వాత మరోసారి కమిటీ సభ్యులు సమావేశం జరపాలని సోనియా కోరినట్లు సమాచారం.

ఆంటోనీ కమిటీ హైదరాబాద్‌కు రావాలని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్న అంశాన్ని పార్టీ అధినేత్రికి రక్షణ మంత్రి వివరించారని తెలిసింది.

వెబ్దునియా పై చదవండి