హైదరాబాద్‌లేని తెలంగాణ ఇవ్వండి: నిఘా వర్గాల నివేదిక!!

సోమవారం, 20 డిశెంబరు 2010 (13:12 IST)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడం ఖాయమని తెలుస్తోంది. అయితే, హైదరాబాద్ లేని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్టు వినికిడి. ప్రధానంగా రాష్ట్ర విభజనపై కేంద్రం జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదిక కంటే.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిఘా సంస్థలు ఇచ్చే నివేదికలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. పైపెచ్చు.. రాష్ట్ర గవర్నర్‌గా పని చేస్తున్న ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ ఈఎస్ఎల్.నరసింహన్ సమర్పించే నివేదికకు కూడా కీలకమారింది. వీరిచ్చే నివేదికల ఆధారంగానే కేంద్ర హోంశాఖ శాంతిభద్రతలపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది.

రాష్ట్రాన్ని విభజిస్తే ఖచ్చితంగా మావోయిస్టుల ప్రాబల్యం పెరిగిపోతుందని నిఘా వర్గాలు ఆది నుంచి వాదిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రాన్ని విభజించడం ద్వారా బీహార్‌, ఉత్తరాంఛల్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా తరహాలో మావోయిస్టుల చేతుల్లోకి తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోతుందని నిఘా వర్గాలు హెచ్చరికలు చేస్తున్నాయి.

అలా చేయడం వల్ల హైదరాబాద్‌‌లో సైతం మావోయిస్టులు తిష్టవేసే అవకాశం ఉందని ఈ వర్గాల ప్రధాన వాదన. ఇప్పటికే... హైదరాబాద్‌ నగరంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం, ఇండియన్‌ ముజాహిదీన్‌, సిమీ, హర్కతుల్‌ జిహాదీ వంటి ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్న విషయాన్ని నిఘా వర్గాలు ప్రస్తావించాయి. వీటితో పాటు మావోయిస్టుల నుంచి కూడా ప్రమాదం ఉత్పన్నమవుతుందని తమ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.

అంతేకాకుండా, హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేసే యోచనలో కేంద్రం ఉంది. ఈ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉంది. అదేసమయంలో రక్షణ శాఖకు చెందిన (మిలిటరీ) ఏవోసీ కేంద్రాలు, తయారీ కేంద్రాలు, విమాన తయారీ కేంద్రాలు, ఎయిర్‌ఫోర్స్‌, ఎయిర్‌పోర్టు, మిథానీ, రక్షణశాఖకు సంబంధించిన కేంద్రాలతో పాటు అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు, కేంద్రాలు ఉన్నాయి.

రాష్ట్రాన్ని విభజిస్తే వీటికి కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నట్టు నిఘా వర్గాలు తమ నివేదికలో పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలాంటి హైదరాబాద్‌‌ను తెలంగాణాలో కలపడం వల్ల భవిష్యత్‌లో ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని విభజించాలని భావిస్తే హైదరాబాద్‌ను వేరు చేసి తెలంగాణను విడగొట్టాలని నిఘా వర్గాలు సూచించినట్టు సమాచారం. అయితే, హైదరాబాద్‌లేని తెలంగాణ.. తలలేని మొండెం వంటిదని తెలంగాణవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా.. రాష్ట్ర విభజనలో హైదరాబాద్ అత్యంత కీలకంకానుంది.

వెబ్దునియా పై చదవండి