యుఎన్ అతిథి గృహంపై ఉగ్రవాదుల పంజా: ముగ్గురు ఉద్యోగులు మృతి

మెషిన్ గన్ల హోరు, బాంబు పేలుళ్ల మోతలతో బుధవారం ఉదయం కాబూల్ నగరం దద్దరిల్లింది. నగరం నడిబొడ్డున ఉన్న యుఎన్ అతిథి గృహాన్ని అధీనంలోకి తెచ్చుకున్న మిలిటెంట్లపై ఆఫ్ఘన్ భద్రతా దళాలు కాల్పులు జరిపాయి.

ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ అధికారి తెలిపిన సమాచారం ప్రకారం అతిథి గృహంలో సుమారు 10 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ విదేశీయులు కావడం గమనార్హం. కాగా ఈ సంఘటనపై ఐక్యరాజ్య సమితి ఎటువంటి ప్రకటన చేయలేదు.

అతిథి గృహాన్ని దిగ్భంధించినట్లు తెలుసుకున్న వెంటనే ఆఫ్ఘన్ భద్రతా దళం వారిపై ఎదురుదాడికి దిగింది. ఈ దాడిలో ఒక మిలిటెంట్ హతమైనట్లు తెలుస్తోంది. కాగా ముగ్గురు ఉద్యోగులను మిలిటెంట్లు పొట్టనబెట్టుకున్నట్లు సమాచారం. ఓ ఆఫ్ఘన్ పోలీసు అధికారి గాయపడ్డారు.

భవనంలోపల సుమారు ఐదు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు ఉన్నారని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘాతుకానికి తమదే బాధ్యత అంటూ తాలిబాన్లు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి