ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా విక్టోరియన్ సిటీ బల్లారత్‌లో భారతీయ టాక్సీ డ్రైవర్‌పై దుండగుడు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన టాక్సీ డ్రైవర్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక కోర్టులో హారజరు పరిచారు. తప్పును అంగీకరించడంతో నిందితునికి మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దాడి జరిగిన కొన్ని గంటలపై నిందితునికి శిక్ష పడటం గమనార్హం.
శుక్రవారం ఉదయం సతీష్ తాటిపాముల అనే 24 సంవత్సరాల భారతీయ టాక్సీ డ్రైవర్‌పై బల్లారత్‌కు చెందిన పాల్ జాన్ బ్రోగ్డన్ అనే 48 సంవత్సరాల వ్యక్తి గాడికి పాల్పడ్డాడు. పీకల్లోతు మద్యం సేవించిన పాల్ జాన్.. టాక్సీ డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ.. దాడి చేశాడు.
దీంతో గాయపడిన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు కేసును విచారించిన మేజిస్ట్రేట్ మైఖేల్ హాడ్జ్‌సన్ మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.