పాక్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఆల్-ఖైదా కుట్ర: అమెరికా
సోమవారం, 20 డిశెంబరు 2010 (11:48 IST)
అణు శక్తి కలిగిన పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి నిషేధిత ఉగ్రవాద సంస్థ ఆల్-ఖైదా కుట్ర పన్నుతోందని అమెరికా హెచ్చరించింది. "అణు శక్తి కలిగిన పాకిస్థాన్ ప్రభుత్వాన్ని తీవ్రవాదులు పడగొట్టకుండా చూసేందుకు ఒబామా పాలనా యంత్రాంగం కృషి చేస్తుంద"ని అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు.
పాకిస్థాన్‌కు పశ్చిమ ప్రాంతంలో ఉన్న అడవులలో నివాసం ఉంటున్నట్లు అనుమానిస్తున్న ఆల్-ఖైదా ఉగ్రవాదులను మట్టుపెట్టడమే అమెరికా లక్ష్యమని, ఫతాలో ఉన్న ఆల్-ఖైదా నివాసాలను నేలమట్టం చేయడానికి అమెరికా ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో స్థిరత్వం సంపాధించడం చాలా ముఖ్యమని, అలా చేయడం ద్వారా ఆల్-ఖైదా తమ స్థావరాలను పునఃస్థాపితం చేసుకోవడం సాధ్యపడని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆఫ్-పాక్ సరిహద్దుల్లో అమెరికా దాడులు నిర్వహించి తీవ్రవాద స్థావరాలను భూస్థాపితం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రాంతాలలో తీవ్రవాదాన్ని పూర్తిగా మట్టుపెట్టాలని అమెరికా భావిస్తోంది. 2014 నాటికి ఆఫ్ఘన్‌లో జరుపుతున్న యుద్ధాన్ని పూర్తి చేసి తమ బలగాలను వెనక్కి పిలిపించుకోవాలని అమెరికా నిర్ణయించింది.