అంగరక్షకుడి చేతిలో హతమైన పాక్ పంజాబ్ గవర్నర్!

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత్రి బెనజీర్ భుట్టో దారుణ హత్యకు అనంతరం భారీ ఘోరం పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. పాకిస్థాన్‌లో బలమైన రాజకీయ నాయకుడు, పంజాబ్ రాష్ట్ర గవర్నర్ సల్మాన్ తసీర్‌ను ఆయన అంగరక్షకుడే హత్యచేశాడు. మంగళవారం ఇస్లామాబాద్‌లో పాక్ పంజాబ్ గవర్నర్‌ను సెక్యూరిటీ గార్డే పొట్టనబెట్టుకున్న ఉదంతం సంచలనం సృష్టించింది.

మంగళవారం తసీర్ ఇస్లామాబాద్‌లో విదేశీయులు, సంపన్న పాకిస్తానీలు ఎక్కువగా సందర్శించే ఖోసర్ మార్కెట్‌కు చేరుకున్న తర్వాత ప్రత్యేక భద్రతా దళానికి చెందిన తసీర్ అంగరక్షకుల్లో ఒకరు ఆయనను కాల్చి చంపేసారని పోలీసు అధికారి మహమ్మద్ ఇఫ్తికార్ చెప్పారు. హంతకుడిని అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నట్లు ఇప్తికార్ వెల్లడించారు. ఈ సంఘటనలో తసీర్ హతమవడంతో పాటు మరో ఐదుగురు అంగరక్షకులు గాయపడినట్లు పోలీసులు చెప్పారు.

2007లో మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య తర్వాత పాకిస్తాన్‌లో ఓ ప్రముఖ నాయకుడిని కాల్చి చంపడం ఇదే మొదటిసారి. తసీర్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పిపిపి)లో బలమైన నాయకుడే కాకుండా పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.

వివాదాస్పద దైవదూషణ వ్యతిరేక చట్టంతో సహా అనేక అంశాలపై తసీర్ ఇటీవలి కాలంలో తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తూ వచ్చారు. ఇస్లామిక్ మతవాదులు ఈ వివాదాస్పద చట్టాన్ని గట్టిగా సమర్థించడమే కాకుండా దాన్ని వ్యతిరేకించిన వారిని దుయ్యబట్టారు. ఈ కారణాలే తసీర్ హత్యకు ప్రధాన కారణమయ్యాయని వార్తలు వస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి